5, ఏప్రిల్ 2015, ఆదివారం

గుజరాత్ తీరంలో రెండు నౌకలు మునక.. 17 మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్..!

యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతుండడంతో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాలకు తిరిగి వెళుతున్నారు. ఈ స్థితిలో యెమెన్ నుంచి 17 మంది సిబ్బందితో అలాంగ్-సోసియాకు బయల్దేరిన రెండు నౌకలు గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా తీర ప్రాంతంలో శనివారం మునిగిపోయాయి. 
 
గుజరాత్ తీర ప్రాంతంలో పిపావాలోని ఐసీజీ స్టేషన్‌కు రెండు నౌకలు ప్రమాదంలో ఉన్నట్లు ఉదయం 10.35 నిమిషాలకు మేసేజ్ పంపారు. మేసేజ్ అందుకున్న పిపావాలోని పోర్ట్ అధికారులు, పిపావా మెరైన్ పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. 
 
వెంటనే భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు పెట్రోలింగ్ బోట్స్ ప్రమాద ప్రాంతానికి వెళ్లగా యెమెన్ కార్గో నౌకలు మునిగిపోతూ కనిపించాయి. దీంతో భారత రక్షక దళం హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని, ఆ నౌకల్లోని 17 మందిని రక్షించాయి. వీరిలో పాకిస్ధాన్, ఇరాన్, యెమెన్ దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్టు తీర రక్షక దళం తెలిపింది. వీరందరిని క్షేమంగా ఆయా దేశాల రాయబారి కార్యాలయాలకు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా శనివారం ఒక్క రోజే యెమెన్‌లో ఉన్న 300 మంది భారతీయులు సురక్షితంగా తిరిగివచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి